Monday, July 21, 2014

మార్చి 2011 - ఆర్థికరంగం

మార్చి 1
¤ అమెరికా, లాటిన్ అమెరికా మార్కెట్లు పుంజుకోవడంతో భారత ఎగుమతులు జనవరిలో 2,060 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 92,700 కోట్లు) కు చేరాయి. ఏడాది క్రితం ఇదే నెల ఎగుమతులతో పోలిస్తే 32.4 శాతం అధికం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు లక్ష్యాన్ని మించి 22,500 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది.
¤ జనవరి నెల దిగుమతులు 13.1 శాతం పెరిగి 2,858 కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 798 కోట్ల డాలర్లు. 
 మార్చి 9
¤ 2009-10 లెక్కల ప్రకారం దేశంలో తలసరి ఆదాయం రూ.33,731 గా నమోదైందని కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ లోక్‌సభలో ప్రకటించారు. రూ.1,20,912 సగటు తలసరి ఆదాయంతో చండీగఢ్ మొదటి స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సగటు తలసరి ఆదాయం రూ.51,025గా ఉంది.
¤ 2010-11 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం రూ.36,003 కి పెరగనుందని మంత్రి వివరించారు. 
 మార్చి 10
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో భారత ఎగుమతులు 200 బిలియన్ డాలర్ల స్థాయిని దాటాయి. ఫిబ్రవరి నెలలో ఎగుమతులు దాదాపు 50 శాతం పెరిగి 23.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తం మీద ఏప్రిల్- ఫిబ్రవరి ఎగుమతులు 208.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇవి 31.4 శాతం ఎక్కువ. అంతేకాక 200 బిలియన్ డాలర్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యాన్ని ఒక నెల ముందే దాటినట్త్లెయ్యింది.
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో దిగుమతులు 18 శాతం ఎక్కువగా 305.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో ఈ 11 నెలలకు వాణిజ్యలోటు 97.1 బిలియన్ డాలర్లుగా నమోదైనట్త్లెయ్యింది. 
 మార్చి 17
¤ ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ఖాదాతారులకు 2010-11 సంవత్సరానికి 9.5 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. 2005-06 నుంచి పీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నారు.
¤ మౌలిక రంగ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడంలో భాగంగా భారత్‌కు 25 కోట్ల డాలర్ల రుణం అందించేందుకు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఏడీబీ, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) సంతకాలు చేశాయి.
¤ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ముంబయిలో మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్ష చేపట్టింది. ముఖ్యాంశాలు:
¤ రెపో, రివర్స్ రేపో రేట్లు పావు శాతం చొప్పున పెంపు. దీంతో అవి వరుసగా 6.75 శాతం, 5.75 శాతానికి చేరుకున్నాయి. నగదు నిల్వల నిష్పత్తి (పీఆర్ఆర్)లో ఎలాంటి మార్పు లేదు. ఇది 6 శాతం వద్దే ఉంది.
¤ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు దేశీయంగా ఆహార ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలను 7 శాతం నుంచి 8 శాతానికి పెంచారు.
¤ మూడో త్రైమాసిక సమీక్షలో అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటు 8.6 శాతాన్నే ఆర్‌బీఐ కొనసాగించింది.
 మార్చి 30
¤ ఆంధ్రాబ్యాంక్ దేశవ్యాప్తంగా ఒకే రోజు 20 కొత్త శాఖలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో 9, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 2 చొప్పున, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఒరిస్సాల్లో ఒక్కో శాఖను కొత్తగా ఏర్పాటు చేసింది. వీటితో కలిపి 2010-11లో మొత్తం 75 శాఖలు ప్రారంభించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ బ్యాంకు మొత్తం శాఖల సంఖ్య 1632కు చేరింది. 
 మార్చి 31
¤ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే 738 ప్రాజెక్టులకు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రూ. 1,236.89 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.
¤ గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ. 13,274.76 కోట్ల మంజూరయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుకు రూ. 372.72 కోట్ల కేటాయించారు. 1.5 లక్షల హెక్టార్లను బిందు, తుంపర సేద్యం కిందకు తీసుకురావాలని ప్రతిపాదించారు. గ్రామీణ తాగునీటి విభాగానికి రూ. 237.17 కోట్లు అందనున్నాయి. పంచాయతీరాజ్‌కు రూ. 209.85 కోట్లు, రోడ్లు భవనాలకు రూ. 75.30 కోట్లు, మహిళలు, పిల్లల సంక్షేమానికి, 1384 అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ. 50 కోట్లు, సాంకేతిక విద్యాశాఖకు రూ. 35.70 కోట్లు, నీటిపారుదల, ఆయకట్ల అభివృద్ధిశాఖకు రూ. 35.03 కోట్లు, గిరిజన సహకార సంస్థకు రూ. 18.99 కోట్లు కేటాయించారు.
¤ 2010-11 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య బడ్జెట్ అంచనాలలో 68.6 శాతంగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలోని 92 శాతంతో పోల్చి చూస్తే ద్రవ్యలోటు మెరుగుపడినట్లే, 2009-10 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో ద్రవ్యలోటు రూ. 3.80 లక్షల కోట్లు ఉండగా, 2010-11 మొదటి 11 నెలల్లో రూ. 2.75 లక్షలకు పరిమితమైంది.
¤ 2010-11 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య సర్కారు నికర పన్ను వసూళ్లు రూ. 4.60 లక్షల కోట్లు, మొత్తం వ్యయం రూ. 9.78 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికార ప్రకటన వెల్లడించింది. పన్నేతర రాబడులు రూ. 2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా స్పెక్ట్రమ్ వేలం నుంచి సుమారు రూ. 1.08 లక్షల కోట్లు అందడం గమనార్హం.
¤ గత డిసెంబరు ఆఖరుకు భారత విదేశీ రుణభారం 297.5 బిలియన్ డాలర్లు (రూ. 13.36 లక్షల కోట్లు)కు పెరిగింది. 2010 మార్చి కంటే ఇది 13.9 శాతం అధికం. వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల డిపాజిట్లు కలిసిన భారత విదేశీ రుణం గత ఏడాది మార్చి ఆఖరుకు 261.2 బిలియన్ డాలర్లు (11.75 లక్షల కోట్లు)గా నమోదైంది. దీర్ఘకాల రుణం 26 బిలియన్ డాలర్లు ఎక్కువగా 234.9 బిలియన్ డాలర్లకు, స్వల్పకాల రుణం 10.3 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 62.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఒక ప్రకటనలో వివరించింది.

No comments:

Post a Comment