Monday, July 21, 2014

నవంబరు 2011 - ఆర్థికరంగం

నవంబరు 3 
¤ డిపాజిట్ చేసిన మొత్తం రెట్టింపు అయ్యేవిధంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 'డబుల్ పేరుతో సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుత వడ్డీరేట్ల ప్రకారం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం 87 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇది 13.84% రాబడికి సమానం.
¤ అదే సీనియర్ సిటిజన్స్‌కైతే కేవలం 83 నెలల్లో రెట్టింపు అవుతుంది.వీరికి 14.56% రాబడి లభించనుంది
.
¤ కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.10,000 ఆ పైన రూ.1,000 చొప్పున గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు
నవంబరు 5 
¤ 2010-11 ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 341 లక్షల టన్నుల సేకరణ జరగ్గా, అందులో 96.10 లక్షల టన్నులను ఒక్కఆంధ్రప్రదేశే సేకరించింది. 86.34 లక్షల టన్నులతో పంజాబ్ రెండో స్థానంలో, 37.40 లక్షల టన్నులతో ఛత్తీస్‌గఢ్ మూడో స్థానంలో నిలిచాయి
నవంబరు 7 
¤ రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 1983-84 నుంచి 2010-11 వరకు ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం రుణం రూ. 10,696 కోట్లు.
¤ ఆంధ్రప్రదేశ్‌కున్న మొత్తం రుణ బాధ్యతల్లో ప్రపంచ బ్యాంకు వాటా7.82 శాతం మాత్రమే కావడం గమనార్హం.
¤ ఐబీఆర్‌డీ( అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు), ఐడీఏ(అంతర్జాతీయ అభివృద్ధి సంఘం) ద్వారా రెండు రకాల అప్పులను ప్రపంచ బ్యాంకు ఇస్తోంది. మధ్య తరహా ఆదాయం గల దేశాలకు ఐబీఆర్‌డీ ద్వారాను, పేద దేశాలకు ఐడీఏ ద్వారా రుణాలు అందుతాయి. ఐబీఆర్‌డీ ద్వారా ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం 6.94% వడ్డీతో పాటు మరికొన్ని రుసుములు కూడా ఉండగా, ఐడీఏ రుణానికి మాత్రం వడ్డీకి బదులు స్వల్పంగా ఇతర రుసుములే ఉంటాయి. రాష్ట్రానికి ఈ రెండు రకాలుగానూ రుణాలు అందుతున్నాయి. మొదటి రకం రుణాన్ని 20 ఏళ్లలోను, రెండో రకం రుణాన్ని 35 ఏళ్ల వ్యవధిలోను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 
నవంబరు 8 
¤ యూరో జోన్ సంక్షోభ ప్రభావం మన ఎగుమతులపై పడింది. భారత ఎగుమతులు అక్టోబరులో 19.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఖరీదైన ముడి చమురు కారణంగా దిగుమతులు 39.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ పరిణామాలతో వాణిజ్య లోటు 19.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
¤ జూలైలో 82% వృద్ధిని నమోదు చేసుకున్న ఎగుమతులు ఆగస్టులో 44.25 శాతం, సెప్టెంబరులో 36.36%, అక్టోబరులో 10.8% మేర పెరుగుతూ వచ్చాయి. ఏరంగంలో చూసినా గత మూడు నెలల్లో ఇది తక్కువ వృద్ధి అని వాణిజ్య కార్యదర్శి రాహుల్ ఖుల్లార్ పేర్కొన్నారు.
¤ ఆర్థిక వ్యవస్థ మందగించడం, కొద్ది నెలల క్రితం పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వంటి కారణాలతో అక్టోబరు నెలకు పరోక్ష పన్ను వసూళ్లు 2.5 శాతం తగ్గి రూ. 30,278 కోట్లకు పరిమితమయ్యాయి.
¤ ఏడాది క్రితం ఇదే నెలలో ఈ వసూళ్లు రూ. 31,058 కోట్లు ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పరోక్ష పన్ను వసూళ్లలో కస్టమ్స్, ఎక్సైజ్, సేవల పన్ను ఆదాయం ఉంటుంది.
¤ అక్టోబరు నెలకు కస్టమ్స్ పన్ను వసూళ్లు 11.6 శాతం తగ్గి రూ. 12,849 కోట్ల నుంచి రూ. 11,357 కోట్లకు పరిమితమయ్యాయి. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం వసూళ్లు 5.3 శాతం తగ్గి రూ. 10,527 కోట్లకు చేరాయి. సేవల పన్ను వసూళ్లు మాత్రం 18.4 శాతం పెరిగి రూ. 7,089 కోట్ల నుంచి రూ. 8,394 కోట్లకు పెరిగాయి. 
నవంబరు 9 
¤ భారత బ్యాంకింగ్ వ్యవస్థ రేటింగ్‌ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలా'నికి సవరించనట్టు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ప్రకటించింది.
¤ ''మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ ఇక్కడి బ్యాంకుల ఆస్తుల, మూలధనం, లాభాదాయకతలపై ప్రభావం చూపుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్తుపై అంచనాలను సవరించాం" అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, విశ్లేషకుడు వినీత్ గుప్తా ప్రకటించారు.
¤ ''బ్యాంకింగ్ వ్యవస్థ రేటింగ్‌ను తగ్గించినప్పటికీ స్థిరంగా డిపాజిట్లు సమకూర్చే ఖాతా దారులు, ప్రభుత్వ వాటా బ్యాంకులకు సానుకూల అంశాలు. ఈ రెండూ బ్యాంకులకు నిధుల కొరత రానివ్వవు. ఒడుదొడుకులు కలిగించే అస్థిరత్వం నుంచి బ్యాంకులను కాపాడతాయని మూడీస్ పేర్కొంది.
¤ గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రేటింగ్‌ను మూడీస్ తగ్గించిన విషయం తెలిసిందే. దేశంలో 15 వాణిజ్య బ్యాంకులకు మూడీస్ రేటింగ్ ఇస్తోంది 20011 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆస్తుల్లో వీటి వాటా దాదాపు 66 శాతం ఉంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే పై చేయి. 
నవంబరు 10 
¤ ప్రముఖ రేటింగ్స్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ & పీ) భారతీయ బ్యాంకింగ్ రంగానికి రేటింగ్‌ను మెరుగు పరచింది. ఈ సంస్థ భారత బ్యాంకింగ్ రంగంలో రిస్క్ ప్రొఫైల్ (బ్యాంకింగ్ ఇండస్ట్రీ) కంట్రీ రిస్క్ అసెస్‌మెంట్స్- బైక్రా)ను ఒక అంచె మేరకు పెంచి 'గ్రూప్ 6' నుంచి 'గ్రూప్ 5' కు చేర్చింది.
¤ మరో రేటింగ్ సంస్థ 'మూడీస్ ఒక రోజు క్రితమే భారతీయ బ్యాంకింగ్ రంగ అవుట్‌లుక్ ను 'స్థిరత్వం' నుంచి 'ప్రతికూలానికి' జార్చిన విషయం విదితమే.
¤ (బైకా) గ్రూప్5లో ఉన్న ఇతర దేశాలలో చైనా, పోర్చుగల్, థాయ్‌లాండ్, టర్కీలు ఉన్నాయి. 
నవంబరు 11 
¤ యూనియన్ బ్యాంక్ తమ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా 111 కొత్తశాఖలను ప్రారంభించింది. 11-11-2011 తేదీని పురస్కరించుకొని 111 కొత్తశాఖలను ప్రారంభించింది.
¤ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొవాలని, దక్షిణాసియా అంతటా ఆంక్షలులేని సరళీకృత వాణిజ్య విధానాలను తీసుకురావాలని సార్క్ సదస్సు తీర్మనించింది.
¤ రెండు రోజుల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సార్క్ దేశాలు సంయుక్తంగా ''అద్దూ ప్రకటన" పేరుతో ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. సార్క్‌దేశాలు మధ్య రైల్వే, నౌక మోటారు వాహనాల రాకపోకలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ ప్రకటన పేర్కొంది.
¤ మరో వైపు, ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పదించే వ్యవస్థ ఏర్పాటు, విత్తనాల బ్యాంకును నెలకొల్పడం, మత్తుపదార్థాలు, వ్యక్తుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తదితర అంశాలతో కూడిన సార్క్ ఒప్పందంపై సార్క్ దేశాధినేతలు సంతకాలు చేశారు.
¤ ప్రధాని మన్మోహాన్ సింగ్ నేపాల్ ప్రధాని బాబూరాం భట్టారాయ్, అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో వేర్వేరుగా సమావేశమై చర్చలు జరిపారు.
నవంబరు 16 
¤ స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల బ్రాండ్ ఫావ్రే లూబాను 2 మిలియన్ యూరోల (రూ.13 కోట్ల) తో టైటన్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. 1737లో స్థాపించిన ఫ్రావ్రే లూబాకు ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్ర ఉంది.
నవంబరు 17 
¤ విశాఖపట్నంలో రూ. 11,196 కోట్ల పెట్టుబడితో భారీ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌కు చెందిన అమెరిండ్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
¤ ఈ ప్రాజెక్టును పెట్రోలియం కెమికల్స్ పెట్టుబడుల ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం విశాఖజిల్లా అచ్యుతాపురంలో వెయ్యి ఎకరాల భూమితోపాటు మెగా ప్రాజెక్టు కింద పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.
¤ రాష్ట్రంలో ఏర్పాటయ్యే మొట్టమొదటి ప్రైవేటు రిఫైనరీ ఇదేనని, దీనిద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నులు, సర్‌ఛార్జి రూపేణా రూ. 15,444 కోట్ల ఆదాయం వస్తుందని, ఒక్క రాష్ట్రానికైతే రూ. 7,122 కోట్ల ఆదాయం ఉంటుందని భారీ పరిశ్రమల మంత్రి గీతారెడ్డి చెప్పారు.
¤ ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ, కార్పొరేట్ బాండ్లలోనూ విదేశీ సంస్థాగత మదుపుదార్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల పరిమితిని చెరి 5 బిలియన్ డాలర్ల (రూ. 25 వేల కోట్లు) మేర పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. భారత కార్పొరేట్లకు వనరుల లభ్యతను పెంచడంతోపాటు దేశానికి మూలధన నిధుల ప్రవాహాన్ని ఇది అధికం చేయగలదు.
¤ తాజా నిర్ణయంతో ఎఫ్ఐఐలు ఇకపై ప్రభుత్వ సెక్యూరిటీలలో 15 బిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడులు పెట్టవచ్చు.
¤ కాగా, దీర్ఘకాల మౌలిక బాండ్లలో పెట్టుబడులు పరిమితిలో ఎలాంటి మార్పు లేకుండా 25 బిలియన్ డాలర్ల వద్దే ఉంచారు.
¤ ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరిమితి రూ. 43,650 కోట్లు కాగా అక్టోబరు 31, 2011 నాటికి వారు రూ. 41,253 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇదేవిధంగా కార్పొరేట్ బాండ్లలో పరిమితి రూ. 74,416 కోట్లు ఉండగా గత నెలాఖరు నాటికి రూ. 68,289 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 
నవంబరు 21 
¤ రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.52.16 ధరకు పడిపోయింది. గత 33 నెలల కాలంలో ఇదే కనిష్ఠ ధర (2009 మార్చి 12న రూ. 52.20గా నమోదైంది). ఈ ఏడాది ఆగస్టు 2న రూపాయి మారకం విలువ రూ.44.07 కాగా అప్పట్నుంచే విలువ క్షీణత మొదలై ఇప్పుడు కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
¤ రూపాయి పతనానికి ప్రధాన కారణం అమెరికా, ఐరోపా దేశాల్లో నెలకొని ఉన్న అననుకూల ఆర్థిక వాతావరణమే. అప్పులు కట్టలేక గ్రీస్ చేతులెత్తేయటం, రెండు ఫ్రెంచ్ బ్యాంకుల రేటింగ్ తగ్గిపోవడంతో ఐరోపా దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో యూరో విలువ క్షీణించి, డాలర్ బలపడింది. ఇదే ప్రభావం ఇతర దేశాలపై పడి ఆయా దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. ఈ పరిస్థితులే రూపాయి మీద కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో స్టాక్ మార్కెట్ల నుంచి మదుపుదార్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సర్వసాధారణం.
¤ ఇక మన దేశంలో సమస్యలు భిన్నంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం కుంగదీస్తోంది. ఎన్నో నెలల నుంచి ఇది తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో వడ్డీరేట్లు పెరిగాయి. సరకులు, ముడి పదార్థాలు ఖరీదైపోయాయి. తత్ఫలితంగా పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఎగుమతులు పడిపోయాయి. అదే సమయంలో అధిక దిగుమతులు తప్పడం లేదు. దీనివల్ల వాణిజ్య లోటు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దిగుమతులకు పెద్ద ఎత్తున డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో మన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (విదేశీ మారక నిల్వ) తరిగిపోతోంది. మరో పక్క అధిక ముడిచమురు ధర వేధిస్తూనే ఉంది. ఇంటా బయటా అన్ని పరిస్థితులూ ఒక్కసారిగా వ్యతిరేకంగా మారిపోయి రూపాయి మారకం విలువ వేగంగా క్షీణిస్తోంది.
¤ రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండటం ఎంతో అవసరం. ఎప్పుడూ హెచ్చుతగ్గులకు లోనయ్యే పక్షంలో ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. పెరిగినా, తగ్గినా దిగుమతులు - ఎగుమతులు ఖరీదైపోతాయి. సంబంధిత రంగాల్లోని సంస్థలకు ఇబ్బందులే. రూపాయి విలువ గణనీయంగా క్షీణించిన ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతి చేసుకునే మందులు, నిత్యావసర వస్తువులు, నూనెలు, ఎరువులు ఖరీదైపోతున్నాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి చేసుకోవడం కష్టమైపోతుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ పరిస్థితి పెను భారమే. రూపాయి బలహీనత వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి, పరోక్షంగా సామాన్యులకు దీని వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. 
నవంబరు 28 
¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2011-12)లో భారత ఆర్థిక వృద్ధిరేటు 7.6 శాతానికి పరిమితం కావచ్చని ప్యారిస్‌కు చెందిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్) అనే సంస్థ అంచనా వేసింది. ఓఈసీడీలో 34 దేశాలకు సభ్యత్వం ఉంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన వృద్ధిరేటు 8.8 శాతంగా ఉంది. 
నవంబరు 29 
¤ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 2004-05 నుంచి 2010-11 వరకు నమోదైన వృద్ధి రేట్లను ప్రణాళిక సంఘం తాజాగా విశ్లేషించింది. రాష్ట్రంలో ఈ ఏడేళ్ల సగటు 8.71 శాతంగా తేలింది. జాతీయ సగటు (8.45 శాతం) కంటే ఇది కొంచెం ఎక్కువ. ఇదే సమయంలో 17 రాష్ట్రాల్లో 8.73 నుంచి 13.19 శాతం వరకు వృద్ధి కనిపించింది.
¤ 12వ పంచవర్ష ప్రణాళిక కాలం (2012-17)లో సగటున 10 శాతం వృద్ధిని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. గత ఏడేళ్లలో సగటు వృద్ధి రేటు 8.71 శాతం ఉన్నట్లు తేలిన నేపథ్యంలో తన లక్ష్య సాధనకు ప్రభుత్వం చాలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 
నవంబరు 30 
¤ అంతర్జాతీయ ఆర్థిక ఒడుదొడుకులతో నలిగిపోతున్న ప్రపంచ బ్యాంకింగ్ రంగానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా 15 బ్యాంకుల రేటింగ్‌ను స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) తగ్గించింది. వీటిలో అమెరికాకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో బ్యాంకులు ఉన్నాయి. ఐరోపా దిగ్గజ బ్యాంకులు హెచ్ఎస్‌బీసీ, లాయిడ్స్, బ్యాంకింగ్ గ్రూప్, ఆర్‌బీఎస్ (రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్) రోబో బ్యాంక్, బార్‌క్లాస్ రేటింగ్‌లను కూడా ఎస్ అండ్ పీ తగ్గించింది.
¤ బీఎస్‌పీ పారిబస్, క్రెడిట్ అగ్రికోల్, డాయిష్ బ్యాంకుల రేటింగ్‌లను యథాతథంగా కొనసాగించింది.
¤ ప్రపంచ వ్యాప్తంగా 37 బ్యాంకుల రేటింగ్‌ను సమీక్షించిన ఎస్ అండ్ పీ చైనాకు చెందిన బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకుల రేటింగ్‌లను పెంచడం విశేషం. సమీక్షించిన బ్యాంకుల్లో భారత బ్యాంకులు లేవు.
¤ ప్రపంచ ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - పరిశోధన అభివృద్ధి) రంగంలో సంచలనం సృష్టిస్తున్న కంపెనీలతో యూరోపియన్ కమిషన్ (ఈసీ) రూపొందించిన జాబితాలో 18 భారతీయ కంపెనీలు చోటు పొందాయి. వీటిలో భారతీయ దిగ్గజాలన్నింటినీ తోసిరాజని టాటా మోటర్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. పరిశోధనలు, సృజనాత్మక కార్యకలాపాలపై భారీ పెట్టుబడుల ప్రాతిపదికగా ఈ జాబితాను రూపొందించారు. తర్వాతి స్థానాల్లో పృథ్వీ ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్, పొలారిస్ సాఫ్ట్‌వేర్, బిహెచ్ఇఎల్ మహీంద్రా అండ్ మహీంద్రాలు నిలిచాయి.
¤ భారతీయ కంపెనీల జాబితాలో తర్వాతి స్థానాల్లో కేపీఐటీ కమిన్స్ ఇన్ఫో (6), జైలాగ్ సిస్టమ్స్ (7), డాక్టర్ రెడ్డీస్(8), లుపిన్(9), ఇన్ఫోసిస్ (10), రిలయన్స్ ఇండస్ట్రీస్ (11), కోర్ ప్రాజెక్ట్స్ (12), భారత్ ఎలక్ట్రానిక్స్ (13), అశోక్ లేల్యాండ్ (14), సిప్లా (15), సన్ ఫార్మా (16), ఓఎన్‌జీసీ (17), ఎఫ్‌సిఎస్ సాఫ్ట్‌వేర్ (18) ఉన్నాయి.
¤ గ్లోబల్ ఆర్ ఆండ్ డి జాబితాలో మాత్రం టాటా మోటార్స్ ర్యాంకు 264 కావడం గమనార్హం. మిగిలిన 17 భారత కంపెనీలు 300 నుంచి 1400 ర్యాంకుల మధ్యలో ఉన్నాయి.
¤ గ్లోబల్ టాప్-5 కంపెనీల జాబితాలో మూడు ఫార్మా కంపెనీలే. స్విస్ ఫార్మా దిగ్గజం రోచ్ జాబితాలో ప్రథమ స్థానం దక్కించుకుంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ రెండో స్థానంలో నిలిచింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడో స్థానాన్ని పొందింది. జపనీస్ ఆటో దిగ్గజం టొయోటో నాలుగో స్థానం, ఔషధ కంపెనీ మెర్క్ అయిదో స్థానాన్ని పొందాయి.
¤ కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్ఓ) ప్రకటించిన వృద్ధి గణాంకాల ప్రకారం జులై - సెప్టెంబరు కాలానికి భారత వృద్ధి 6.9 శాతంగా నమోదైంది (గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ వృద్ధి 8.4%). ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్‌లో వృద్ధిరేటు 7.7 శాతం నమోదైంది.
¤ ప్రభుత్వం వెలువరించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో జీడీపీ 7.3%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే ఆరు నెలల కాలంలో వృద్ధి 8.6%గా ఉంది. 
¤ 2011-12 తొలి ఏడు నెలల్లో భారత ద్రవ్యలోటు రూ. 3.07 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యం రూ.4.128 లక్షల కోట్లలో ఇది 74.4 శాతానికి సమానం.
¤ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్- అక్టోబరులో మొత్తం పన్ను వసూళ్లు 18% వృద్ధితో రూ.3.73 లక్షల కోట్లుగా నమోదు కాగా, ప్రభుత్వ వ్యయాలు 10% వృద్ధితో రూ.6.804 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో ద్రవ్యలోటు రూ.3.07 లక్షల కోట్లకు చేరింది.

No comments:

Post a Comment